ప్రసవ సమయంలో శిశువు తల, మొండెం వేరుచేసిన వైద్యులు


ప్రసవ సమయంలో శిశువు తల, మొండెం వేరుచేసిన వైద్యులు


అచ్చంపేట పట్టణం, న్యూస్‌టుడే: ప్రసవ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు శిశువు మరణానికి కారణమయ్యారు. అజాగ్రత్తతో శిశువు తల వేరుచేసి, మొండెం గర్భంలోనే ఉంచేసి ఆ విషయాన్ని సంబంధీకులకు చెప్పకుండానే పెద్దాసుపత్రికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు. బంధువుల ఆందోళనతో విషయం వెలుగులోకి రాగా..కలెక్టర్‌ బాధ్యులైన ఇద్దరు వైద్యులపై వేటు వేశారు. అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన స్వాతిని భర్త సాయిబాబు ఈ నెల 18న ఉదయం 9:45 నిమిషాలకు అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు సుధారాణి వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రసవానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆస్పత్రి పర్యవేక్షకుడు డా.తారాసింగ్‌, మరికొంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ''ప్రసవం కాలేదని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని'' కుటుంబ సభ్యులకు సూచించారు. వారి సూచనతో కుటుంబ సభ్యులు స్వాతిని హైదరాబాద్‌లోని పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి శిశువు మొండెం మాత్రమే గర్భంలో ఉందని, తల లేదని గుర్తించారు. తల ఏమైందంటూ ఆరా తీశారు. ఆ విషయం తెలియని కుటుంబ సభ్యులు  అవాక్కయ్యారు. ''గర్భిణికి శస్త్ర చికిత్స చేసి మిగిలిన శరీర భాగాలను తొలగించామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని'' పేట్లబుర్జు ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఆందోళన..ఆసుపత్రి అద్దాలు ధ్వంసం
నిర్లక్ష్యంతో తలను తొలగించి శిశువు మరణానికి కారణమవడంతోపాటు..తమను తప్పుదోవ పట్టించారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. బంధువులు, గ్రామస్థులతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపుచేసే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. కలెక్టర్‌ శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ బాధితులతో మాట్లాడారు. వైద్యులను విచారించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించి, శిశువు మృతికి కారణమయ్యారనే ప్రాథమిక నివేదికతో ఆస్పత్రి పర్యవేక్షకుడు డా.తారాసింగ్‌, డ్యూటీ వైద్యురాలు సుధారాణిలను సస్పెండ్‌ చేశారు. ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ఇద్దరు సీనియర్‌ గైనకాలజిస్టులు, జాతీయ ఆరోగ్య మిషన్‌ మాతాశిశు సంరక్షణ సంయుక్త సంచాలకులతో త్రిసభ్య కమిటీని నియమించింది. 'ప్రసవం కోసం వచ్చినప్పటికే శిశువు మరణించి ఉంది. తల్లిగర్భం నుంచి తల బయటికి వచ్చేసింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాం. కడుపులో శిశువు కుళ్లిపోయి ఉండటంతో బయటికి తీస్తున్న సమయంలో తల వేరుపడింది' అని  ఆసుపత్రి పర్యవేక్షకులు డా.తారాసింగ్‌, డ్యూటీ వైద్యురాలు సుధారాణి కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు.