దిల్లీ: భారత తొలి త్రిదళాధిపతి(సీడీఎస్)గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ జనవరి 1న ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న ఆయన నేడు పదవీ విరమణ చేశారు. ఈ ఉదయం దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రావత్ నివాళులర్పించారు. అనంతరం సౌత్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌గా చివరిసారిగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తదుపరి సైన్యాధిపతి జనరల్ మనోజ్ నరవణేకు అభినందనలు తెలియజేశారు.
దేశ తొలి సీడీఎస్‌గా రావత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీడీఎస్ హోదాలో కొత్తగా ఏర్పాటయ్యే సైనిక వ్యవహారాల విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తారు. మూడేళ్ల పాటు లేదా గరిష్ఠంగా 65ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది) రావత్ ఈ పదవిలో కొనసాగుతారు.
2016 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రావత్.. మూడేళ్ల పాటు ఈ పదవిలో పనిచేశారు. సైన్యాధిపతి హోదాలో అనేక కీలక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలు తీసుకొచ్చారు. రావత్ స్థానంలో తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే బాధ్యతలు చేపట్టనున్నారు.