అమరావతి: రాజధానిగా అమరాతినే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల దీక్షలకు మద్దతు తెలియజేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలో పర్యటించనున్నారు.
మందడంలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు మందడంలో మహాధర్నా సిద్ధమయ్యారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
రోడ్డుపై ఎవరూ రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో తనిఖీలు చేసి గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు అనుమతిస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రైతులు జాతీయ జెండాలతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు.